అక్టోబర్ 15, 2026 నుంచి స్టాక్ మార్కెట్ ఫండింగ్ కోసం చేసే UPI లావాదేవీలపై **0.02%** ఛార్జ్ అమలులోకి రానుంది. ఈ కొత్త నిబంధనతో బ్రోకరేజ్ సంస్థలు అదనపు సర్వీస్ ఛార్జీలు వసూలు చేసే యోచనలో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ SIPలకు మినహాయింపు ఉన్నప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
మార్కెట్ ట్రేడింగ్ ఫండింగ్‌కు సంబంధించి స్టాక్ బ్రోకర్లు కీలక మార్పులకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 15, 2026 నుంచి క్యాపిటల్ మార్కెట్ లావాదేవీల కోసం చేసే UPI పేమెంట్స్‌పై 0.02% మెర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రతి లావాదేవీపై గరిష్టంగా ₹300 క్యాప్ ఉంది. ఈ పరిణామంతో జీరో బ్రోకరేజ్ మోడల్ భవిష్యత్తుపై సందిగ్ధత మొదలైంది.
అసలు సమస్య ఎక్కడంటే?
SEBI నిబంధనల ప్రకారం, బ్రోకర్లు కస్టమర్ల ఐడిల్ ఫండ్స్‌ను క్రమం తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయాలి. ప్రస్తుతం ఈ పేమెంట్ ఖర్చులను బ్రోకర్లే భరిస్తున్నారు. కొత్త ఛార్జీలతో, ట్రేడింగ్ జరగకపోయినా కేవలం ఫండ్స్ మూవ్‌మెంట్ కోసం బ్రోకర్లకు అదనపు భారం పడనుంది. ఇది ఆదాయం లేని లావాదేవీలపై ఖర్చుగా మారుతోంది.
బ్రోకర్ల ఆలోచన?
ఈ అదనపు భారాన్ని భరించలేక, బ్రోకరేజ్ సంస్థలు కొత్త సర్వీస్ ఛార్జీలు లేదా ఉచిత సేవలపై కోత విధించే అవకాశం ఉంది. నెట్ బ్యాంకింగ్ లేదా ఫిక్స్‌డ్ మ్యాండేట్స్ వంటి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులను ప్రోత్సహించే దిశగా బ్రోకర్లు అడుగులు వేస్తున్నారు.
రెగ్యులేటర్లు ఏమంటున్నాయి?
SEBI ఛైర్‌పర్సన్ తుహిన్ కాంత పాండే బ్రోకర్ల ఆందోళనలను పరిశీలిస్తామని హామీ ఇవ్వగా, NSE ఎండీ అండ్ సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ మాత్రం ఇది బ్రోకర్లకు, క్లయింట్లకు మధ్య ఉన్న వ్యవహారమని స్పష్టం చేశారు. మ్యూచువల్ ఫండ్ SIPలకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉండటం దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చే అంశం. రాబోయే రోజుల్లో మీ బ్రోకరేజ్ సంస్థ తీసుకునే నిర్ణయాలపై నిఘా ఉంచడం ఇన్వెస్టర్లకు చాలా అవసరం.
