రుణాల వసూళ్ల ఏజెంట్ల దుందుడుకు చర్యలపై ఎన్నో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ విషయంలో కఠిన నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం, రుణగ్రహీతలను బెదిరించడం, వేధించడం, పరువు తీయడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని సూచిస్తూ మూడు కొత్త డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌ను విడుదల చేయనుంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే, ఫైనాన్షియల్ సంస్థలు తమ రికవరీ ఏజెంట్ల ప్రవర్తనకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
వినియోగదారుల రక్షణకు పెద్దపీట
రికవరీ ఏజెంట్లపైనే కాకుండా, ఆర్థిక ఉత్పత్తుల మిస్-సెల్లింగ్‌పై (అంటే, అనవసరమైన లేదా సరిపోని లోన్లు, బీమా, పెట్టుబడుల పథకాలు అమ్మడం) కూడా RBI దృష్టి సారించింది. ఈ విషయంలో కూడా కఠినమైన నియంత్రణలు తీసుకురానుంది. దీంతోపాటు, అనధికారిక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల వల్ల జరిగిన నష్టాలకు వినియోగదారులకు గరిష్టంగా ₹25,000 వరకు పరిహారం అందించేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. డిజిటల్ చెల్లింపుల భద్రతను మెరుగుపరచడంపై కూడా RBI ఒక చర్చా పత్రాన్ని (Discussion Paper) విడుదల చేయనుంది. ఇందులో భాగంగా, సీనియర్ సిటిజన్ల వంటి బలహీన వర్గాలకు మెరుగైన అథెంటికేషన్, ఆలస్యంగా ఖాతాలో జమ అయ్యే సదుపాయాలు వంటివి తీసుకువచ్చే అవకాశం ఉంది.