2016లో ప్రారంభమైన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) చట్టం, అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీల సమస్యలను పరిష్కరించడంలో ఎంతో ఉపయోగపడింది. ఈ చట్టం ద్వారా ఇప్పటివరకు సుమారు ₹3.5 లక్షల కోట్ల రుణాలను పరిష్కరించారు. అయితే, కాలక్రమేణా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. పరిష్కార ప్రక్రియలు తరచుగా 330 రోజుల లక్ష్యాన్ని దాటి, 600 రోజులకు పైగా సాగాయి. సుప్రీంకోర్టు తీర్పులు ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చాయి. కొన్నిసార్లు ప్రభుత్వ బకాయిలు, రుణదాతల ప్రాధాన్యత క్రమాన్ని దెబ్బతీశాయి.
కీలక సంస్కరణలు
ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకే, భారత పార్లమెంటు ఇప్పుడు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టపీ కోడ్ (IBC) లో కీలకమైన సవరణ బిల్లు, 2025 ను ఆమోదించింది. ఈ మార్పులు నాలుగు ప్రధాన రంగాలపై దృష్టి సారించాయి:
కోర్టుల బయటే వేగవంతమైన పరిష్కారాలు
కొత్తగా, 'క్రెడిటర్-ఇనిషియేటెడ్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్' (CIIRP) ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఆర్థిక సంస్థలు అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీల సమస్యలను నేరుగా, కోర్టుల (NCLT) బయటే పరిష్కరించుకోవచ్చు. ఈ ప్రక్రియకు 150 రోజుల గడువు ఉంటుంది. ప్రమోటర్లు సహకరించకపోతే, ఈ కేసు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP) కి మారుతుంది.
జాప్యాలకు చెక్, స్పష్టమైన నియమాలు
డిఫాల్ట్ రుజువైన తర్వాత, ఇన్సాల్వెన్సీ అప్లికేషన్లను కోర్టులు సులభంగా తిరస్కరించకుండా నిబంధనలు కఠినతరం చేశాయి. ప్రభుత్వ బకాయిలకు ఆటోమెటిక్ గా ప్రాధాన్యత లభించకుండా, సెక్యూరిటీ హక్కులు ఒప్పందాల ఆధారంగా ఉంటాయని స్పష్టం చేశారు. సెక్యూర్డ్ రుణదాతలకు వారి పూచీకత్తు (Collateral) విలువ ఆధారంగా చెల్లింపులు జరుగుతాయి. దీనివల్ల కంపెనీల లిక్విడేషన్ కంటే రికవరీకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.
కొనుగోలుదారులకు 'క్లీన్ స్లేట్', అంతర్జాతీయ రుణ సమస్యలకు రూల్స్
'క్లీన్ స్లేట్' సూత్రాన్ని ఇప్పుడు చట్టబద్ధం చేశారు. అంటే, అప్పుల్లో ఉన్న కంపెనీలను కొనుగోలు చేసిన వారికి గత బకాయిల నుండి విముక్తి లభిస్తుంది. ఇది ప్రభుత్వ సంస్థల నుండి వచ్చే క్లెయిమ్ లను అడ్డుకుంటుంది. అంతేకాకుండా, సరిహద్దు రుణ సమస్యలను (Cross-border Insolvency) పరిష్కరించేందుకు UNCITRAL నమూనా చట్టానికి అనుగుణంగా కొత్త నిబంధనలు కూడా చేర్చారు. భవిష్యత్తులో పెద్ద కంపెనీ గ్రూపుల ఇన్సాల్వెన్సీని నిర్వహించేందుకు కూడా చట్టం మార్గం సుగమం చేసింది.