వ్యక్తిగత డైరీల్లో రాసుకున్న లెక్కల ఆధారంగా మాత్రమే పన్ను అదనంగా విధించలేమని ITAT అహ్మదాబాద్ స్పష్టం చేసింది. సెక్షన్ 69C కింద రూ. 33.5 లక్షల ట్యాక్స్ డిమాండ్‌ను కొట్టివేస్తూ, ఆదాయానికి సరైన ఆధారాలు ఉంటే సరిపోతుందని కోర్టు పేర్కొంది.
అహ్మదాబాద్‌లోని ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే కీలక తీర్పును వెలువరించింది. అసెస్‌మెంట్ ఇయర్ 2012-13కి సంబంధించి, కేవలం వ్యక్తిగత డైరీ నోట్స్ ఆధారంగా రూ. 33.50 లక్షల పన్నును అదనపు ఆదాయంగా పరిగణించడంపై ట్రిబ్యునల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెక్షన్ 69C ప్రకారం, అధికారులు దీనిని unexplained expenditureగా భావించినప్పటికీ, సరైన ఆధారాలు లేకుండా పన్ను వేయడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది.
'టెలిస్కోపింగ్' ప్రిన్సిపుల్ కీలకం
ఈ కేసులో ట్రిబ్యునల్ 'టెలిస్కోపింగ్' (Telescoping) సూత్రాన్ని వర్తింపజేసింది. అంటే, ఖర్చులకు సంబంధించిన నిధుల మూలాలను ధృవీకరించినప్పుడు, ఆ ఖర్చులను చట్టబద్ధమైన ఆదాయంగా పరిగణించవచ్చు. సదరు వ్యక్తి తన మామగారి నుంచి నిధులు అందాయని వాదించగా, దానికి తగ్గట్టుగా బ్యాంక్ రికార్డులను సమర్పించారు. సదరు కాలంలో ఆమె మామగారు సుమారు రూ. 1.16 కోట్ల నగదును విత్ డ్రా చేసినట్లు ఆధారాలు చూపారు. 2009-10 నుండి 2020-21 వరకు మొత్తం రూ. 6.72 కోట్ల నగదు విత్ డ్రాయల్స్ జరిగాయి. ఈ ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్, డైరీలో ఉన్నది పాత నిధులని, అది అక్రమ ఆదాయం కాదని నిర్ధారించింది.
ఆడిట్ ట్రయల్ ఎందుకు ముఖ్యం?
ఈ తీర్పు ద్వారా పన్ను చెల్లింపుదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక అందుతోంది. కేవలం నోట్ బుక్స్ లేదా డైరీల మీద ఆధారపడితే సరిపోదు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం పొందినా సరే, దానికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, విత్ డ్రాయల్ ప్రూఫ్స్ వంటి కచ్చితమైన ఆడిట్ ట్రయల్ (Audit Trail) ఉంచుకోవాలి. అనవసరమైన ట్యాక్స్ నోటీసుల నుంచి తప్పించుకోవడానికి ఆర్థిక లావాదేవీలన్నింటినీ డాక్యుమెంట్ చేయడం అత్యవసరమని ఈ కేసు నిరూపిస్తోంది.
