మంచి CIBIL స్కోరు ఉన్నంత మాత్రాన హోమ్ లోన్ వస్తుందని గ్యారెంటీ లేదు. బ్యాంకులు మీ CIBIL స్కోరుతో పాటు 'FOIR' (Fixed Obligation to Income Ratio) ని ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటాయి. మీ ఆదాయంలో ఇప్పటికే అప్పుల భారం ఎక్కువగా ఉంటే, లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
చాలా మంది హోమ్ బయర్లు మంచి CIBIL స్కోరు ఉంటే చాలు, బ్యాంకులు వెంటనే లోన్ మంజూరు చేస్తాయని భావిస్తారు. కానీ, గతంలో అప్పులు సకాలంలో చెల్లించినా, బ్యాంకులు లోన్ రిజెక్ట్ చేసే సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే, మీ గత చరిత్ర కంటే, ప్రస్తుత మీ ఆర్థిక పరిస్థితిని బ్యాంకులు ఎక్కువగా విశ్లేషిస్తాయి.
లోన్ అప్రూవల్ లో FOIR పాత్ర
హోమ్ లోన్ తిరస్కరణకు ప్రధాన కారణం FOIR (Fixed Obligation to Income Ratio). మీ నెలవారీ ఆదాయంలో ఇప్పటికే ఈఎంఐల రూపంలో ఎంత శాతం ఖర్చవుతుందో చెప్పే లెక్కే ఇది. మీరు కొత్తగా హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు, పాత అప్పులు (కార్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్లులు) + కొత్త హోమ్ లోన్ EMI రెండింటినీ కలిపి బ్యాంకులు లెక్కిస్తాయి.
సాధారణంగా మీ మొత్తం అప్పుల భారం మీ టేక్-హోమ్ శాలరీలో 40% నుండి 55% లోపు ఉండాలని బ్యాంకులు ఆశిస్తాయి. ఒకవేళ మీ కొత్త EMI ఈ పరిమితిని దాటితే, మీ స్కోరు బాగున్నా బ్యాంకులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడవు.
ఎందుకు రిజెక్ట్ చేస్తాయి?
చాలా మంది పర్సనల్ లోన్లు లేదా 'బై నౌ పే లేటర్' (BNPL) వంటి చిన్న చిన్న అప్పులను లైట్ తీసుకుంటారు. కానీ బ్యాంకులు అన్నింటినీ ఒకేలా చూస్తాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్న ఈ తరుణంలో, బ్యాంకులు మరింత జాగ్రత్తగా ఉంటూ, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అప్లికేషన్లను తిరస్కరిస్తాయి.
ఆస్తి విలువ (Property Valuation)
కేవలం మీ ఆదాయమే కాదు, మీరు కొనే ప్రాపర్టీ కూడా కీలకం. బ్యాంకులు చేసే వెరిఫికేషన్‌లో ఆస్తి టైటిల్స్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్, మరియు మార్కెట్ వాల్యూని చెక్ చేస్తారు. ఒకవేళ బ్యాంక్ అంచనా వేసిన ఆస్తి విలువ, మీరు కోరిన లోన్ అమౌంట్ కంటే తక్కువ ఉంటే లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
అర్హతను ఎలా పెంచుకోవాలి?
- అప్పులను తగ్గించుకోవడం: చిన్న చిన్న పర్సనల్ లోన్లను ముందుగా తీర్చివేయండి.
- డౌన్ పేమెంట్ పెంచడం: దీనివల్ల లోన్ అమౌంట్ తగ్గి, EMI భారం తగ్గుతుంది.
- డాక్యుమెంట్లు సరిచూసుకోవడం: మీ ఆదాయ రికార్డులకు, బ్యాంక్ స్టేట్‌మెంట్లకు పొంతన ఉండేలా చూసుకోండి.
