తక్కువ EMI.. నిజమా? అబద్ధమా?
ఇళ్లు కొనాలనే కలలు కంటున్న ఎంతో మంది, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల EMIలు కట్టలేకపోతున్నారు. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కొత్త రకం లోన్ స్కీమ్స్ ను మార్కెట్లోకి తెస్తున్నాయి. లోన్ మొదలుపెట్టినప్పుడు EMI కట్టాల్సిన పనిలేకపోవడం, లేదా బెలూన్ పేమెంట్స్ వంటివి ఆశ చూపిస్తున్నాయి. ఇవి తాత్కాలికంగా కొంత ఊరటనిచ్చినా, దీర్ఘకాలంలో మాత్రం లోన్ ఖర్చును బాగా పెంచేస్తున్నాయి.
వడ్డీపై వడ్డీ.. అప్పు ఊబి!
EMIలు కట్టకపోయినా, లోన్ మొత్తం అలాగే ఉండదు. అసలుకే వడ్డీ కలుస్తూ పోతుంది. అంటే, మీరు కట్టని వడ్డీపై కూడా మీకు వడ్డీ పడుతుంది. దీనివల్ల లోన్ మొత్తం పెరుగుతూ పోతుంది. దీన్ని తీర్చడానికి లోన్ గడువును పెంచాల్సి వస్తుంది, లేదా తర్వాతి EMIలను బాగా పెంచాల్సి వస్తుంది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, అధిక వడ్డీ రేట్లు ఉన్న సమయంలో వినియోగదారులకు లోన్ అందుబాటులో ఉన్నట్లు చూపించడానికి ఇలాంటి స్కీమ్స్ ను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ, చివరికి వినియోగదారుడికి అయ్యే ఖర్చు మాత్రం విపరీతంగా పెరుగుతోంది.
నిర్మాణంలో ఆలస్యం.. అదనపు భారం!
'పోర్సెషన్ వచ్చేవరకు EMI లేదు' అనే స్కీమ్స్ లో ఇంకో రిస్క్ ఉంది. ఇక్కడ వడ్డీ రేటే కాదు, ప్రాపర్టీ ధర కూడా ఒక సమస్య. ఇలాంటి స్కీమ్స్ ను ఎక్కువగా ప్రీమియం ప్రాజెక్టుల్లోనే అందిస్తున్నారు. అంటే, ప్రాపర్టీ రేటులోనే ఈ ఫైనాన్సింగ్ ఖర్చు కూడా కలిసి ఉంటుంది. వినియోగదారులకు గ్రేస్ పీరియడ్ దొరికిందని అనిపించినా, వాస్తవానికి వారు ఒక అదనపు ఫీజును చెల్లిస్తున్నట్టే. ఒకవేళ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అయితే, వడ్డీ భారం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. దీనివల్ల, చేతికి రాని ఇంటికి కూడా అప్పు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది.
తెలివిగా ఆలోచించకపోతే..!
ఇలాంటి ఫ్లెక్సిబుల్ లోన్ ఆప్షన్స్ వల్ల, లోన్ తీసుకున్నవారి ఆర్థిక పరిస్థితిలో అనిశ్చితి పెరుగుతుంది. ముఖ్యంగా బెలూన్ పేమెంట్స్ విషయంలో, భవిష్యత్తులో ఆదాయం విపరీతంగా పెరుగుతుందని ఊహించుకుంటారు. కానీ, అనుకున్నట్లు ఆదాయం పెరగకపోతే, చివరిలో కట్టాల్సిన పెద్ద మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఇబ్బందులు పడతారు. మామూలు లోన్లలా కాకుండా, ఇలాంటి వాటిల్లో ముందుగానే ఫీజులు, పెరిగిన అసలు కారణంగా, లోన్ ను మార్చడం లేదా మధ్యలో వదిలేయడం చాలా కష్టమవుతుంది. చివరికి, ఈ ఆర్థిక చక్రంలో చిక్కుకుపోయి, నష్టపోవాల్సి వస్తుంది.
