HDFC Bank లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ వ్యాపార వ్యూహాలను బయట వ్యక్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై బ్యాంక్ యాజమాన్యం విచారణ చేపట్టింది. కొత్త CEO అనుప్ బాగ్చీ బాధ్యతలు చేపట్టబోయే కీలక సమయంలో ఈ వివాదం బయటపడటం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.
HDFC Bank లో అంతర్గత నియంత్రణ వ్యవస్థలకు గండి పడింది. అత్యంత గోప్యంగా ఉండాల్సిన వ్యాపార వ్యూహాలను ఇద్దరు ఉన్నతాధికారులు బయట వ్యక్తులకు వెల్లడించినట్లు గుర్తించిన బ్యాంక్, వారిపై విచారణ మొదలుపెట్టింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC లో ఇటువంటి ఘటన జరగడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది.
మారుతున్న నాయకత్వం.. కొనసాగుతున్న సవాళ్లు
ప్రస్తుత CEO శశిధర్ జగదీషన్ తన 6 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనుండగా, అక్టోబర్ 27న కొత్త CEOగా అనుప్ బాగ్చీ పగ్గాలు చేపట్టనున్నారు. అయితే, 2026 ఏడాదిలో వరుసగా జరుగుతున్న మార్పులు సంస్థపై ప్రభావం చూపుతున్నాయి. మార్చిలో చైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా, ఆ తర్వాత డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ భరూచా వైదొలగడం వంటి పరిణామాలు ఇప్పటికే బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ లో అస్థిరతను సూచిస్తున్నాయి.
షేర్ ధరపై ఎఫెక్ట్
ఈ వరుస గందరగోళ పరిస్థితుల మధ్య, ఈ ఏడాదిలో HDFC Bank షేర్ ధర 28% వరకు క్షీణించింది. బ్యాంకింగ్ రంగంలో విశ్వసనీయత, డేటా భద్రత మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల పాటించడం అత్యంత ముఖ్యం. ఈ క్రమంలో, అంతర్గత పాలనా లోపాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి.
రాబోయే రోజుల్లో ఈ విచారణ నివేదికలో ఏం తేలుతుంది? కొత్త నాయకత్వం ఈ పాలనాపరమైన లోపాలను ఎలా సరిదిద్దుతుంది? అనేది ఇప్పుడు మార్కెట్ వర్గాల ప్రధాన ఆసక్తిగా మారింది.
