బ్యాంకులు లోన్ కలెక్షన్స్ మరియు క్రెడిట్ మానిటరింగ్ కోసం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ పై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. EASE 9.0 సంస్కరణల్లో భాగంగా ఈ ఆడిట్ చేపడుతున్నారు.
ప్రస్తుతం దేశీయ బ్యాంకులు రుణాల వసూళ్లు, క్రెడిట్ ప్రాసెస్ ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని భారీగా వాడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా సీరియస్ రివ్యూ ప్రారంభించింది. 'ఎన్హాన్స్‌డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్' (EASE) 9.0 ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రభుత్వం మానిటర్ చేస్తోంది. కేవలం కస్టమర్ కేర్ చాట్‌బాట్‌లకే పరిమితం కాకుండా, రుణాలు ఇచ్చే నిర్ణయాలు, ఫ్రాడ్ డిటెక్షన్ వంటి సెన్సిటివ్ పనుల్లో AI పాత్రపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
ఎందుకు ఈ ఆడిట్?
ఈ ఆడిట్ ప్రధాన ఉద్దేశ్యం బ్యాంకులు కొత్త టెక్నాలజీని వాడుతున్నాయా లేదా అని చూడటమే కాదు, అవి సురక్షితంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించడం. గతంలో ఆటోమేటెడ్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు కస్టమర్ల డేటా ప్రైవసీని పణంగా పెట్టినట్లు, అలాగే వసూళ్లలో దూకుడుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు 'రోబస్ట్ టెక్ స్టాక్స్' ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
RBI నిబంధనలు.. అపారదర్శక అల్గారిథమ్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, అపారదర్శక అల్గారిథమ్స్ (Opaque Algorithms) పెద్ద సమస్యగా మారాయి. ఒక కస్టమర్ లోన్ తిరస్కరణకు గురైతే, దానికి సరైన కారణం ఏంటో బ్యాంకులు చెప్పలేకపోతున్నాయి. ఇకపై ప్రతి ఆర్థిక నిర్ణయం వెనుక స్పష్టమైన లాజిక్ ఉండాలని, అది కస్టమర్‌కు వివరించేలా ఉండాలని రెగ్యులేటర్లు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
సైబర్ భద్రతపై నిఘా
ఈ AI మోడల్స్ హ్యాకింగ్‌కు గురికాకుండా, డేటా లీక్ అవ్వకుండా చూడటానికి 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్' (CERT-In)తో కేంద్రం సమన్వయం చేసుకుంటోంది. బ్యాంకులు కోర్ ఫంక్షన్స్ కోసం అల్గారిథమ్‌లపై ఆధారపడటం వల్ల, భవిష్యత్తులో వచ్చే సైబర్ ముప్పులను ముందుగానే గుర్తించడమే ఈ ఆడిట్ లక్ష్యం. ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. డిజిటల్ బ్యాంకింగ్ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, డేటా గవర్నెన్స్ మరియు కంప్లయన్స్ ఖర్చులు బ్యాంకులపై భారం కానున్నాయి.
