సీబీఐ దాడుల వెనుక కారణం..
హర్యానాలో జరిగిన ఒక పెద్ద బ్యాంకింగ్ మోసం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) రంగంలోకి దిగింది. చండీగఢ్, పంచకులాల్లోని 7 వేర్వేరు ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ప్రభుత్వ నిధులను కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు బ్యాంకింగ్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
IDFC First, AU Small Finance Banks పై ఆరోపణలు..
హర్యానా ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన పబ్లిక్ సర్వెంట్లతో కలిసి IDFC First Bank, AU Small Finance Bank లకు చెందిన కొందరు అధికారులు కుమ్మక్కై, ప్రభుత్వ నిధులను దారి మళ్లించి, దుర్వినియోగం చేశారని అధికారిక ప్రకటనలు సూచిస్తున్నాయి.
కీలక ఆధారాలు, అరెస్టులు..
సీబీఐ నిర్వహించిన ఈ దాడుల్లో, ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, ఆర్థిక రికార్డులు, డిజిటల్ ఆధారాలు వంటివి స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే 16 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది.
దర్యాప్తు పూర్వాపరాలు..
ఈ కేసు దర్యాప్తు బాధ్యతను హర్యానా ప్రభుత్వం అధికారికంగా సీబీఐకి అప్పగించింది. ఈ ఆర్థిక మోసాల పూర్తిస్థాయిలో వెలికితీయడానికి సీబీఐ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా, గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన మరో దర్యాప్తులో, IDFC First Bank కు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగులను ₹645 కోట్ల అవినీతి కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.