2026లో నాలుగోసారి తన SUV ధరలను పెంచేందుకు Mahindra & Mahindra సిద్ధమవుతోంది. ముడి పదార్థాల ధరల భారాన్ని తట్టుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటుండగా, మరోవైపు భారీగా ప్రొడక్షన్ కెపాసిటీని కూడా పెంచుతోంది.
ధరల పెంపు దిశగా M&M!
ప్రస్తుతం ముడి పదార్థాల ధరల్లో వస్తున్న అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, 2026లో మరోసారి ధరలను పెంచే అంశాన్ని Mahindra & Mahindra పరిశీలిస్తోంది. ఇప్పటికే జనవరి, ఏప్రిల్, జూలై నెలల్లో ధరలను సవరించిన కంపెనీ, ఇప్పుడు నాలుగోసారి పెంపునకు సిద్ధమవుతోంది. ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ మరియు CEO నళినీకాంత్ గొల్లగుంట తెలిపిన వివరాల ప్రకారం, ఈ నిర్ణయంపై వచ్చే రెండు వారాల్లో స్పష్టత రానుంది. స్టీల్, అల్యూమినియం వంటి ఖర్చులను వినియోగదారులపైకి మళ్లించడం ద్వారా మార్జిన్లను కాపాడుకోవడం కంపెనీ ప్రధాన వ్యూహం.
ప్రొడక్షన్ సామర్థ్యం 84,000 యూనిట్లకు..
డిమాండ్‌కు అనుగుణంగా వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతోంది. ప్రస్తుతం 60,000 ఐసీఈ (ICE) వాహనాలు, 8,000 ఎలక్ట్రిక్ వాహనాల (EV) సామర్థ్యం ఉండగా, మార్చి-ఏప్రిల్ నాటికి దీన్ని మొత్తం 84,000 యూనిట్లకు (70,000 ICE + 12,000 EV) పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల టాటా మోటార్స్, మారుతీ సుజుకి వంటి ప్రత్యర్థుల వైపు కస్టమర్లు వెళ్లకుండా అడ్డుకునే అవకాశం ఉంది.
EV వ్యూహంపై క్లారిటీ
హైబ్రిడ్ వాహనాల కంటే ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాలకే (EV) ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీ నిర్ణయించుకుంది. ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్‌లు, కఠినమైన CAFE నిబంధనలు EVలకు అనుకూలంగా ఉన్నాయని కంపెనీ భావిస్తోంది. త్వరలోనే రాబోయే రెండు కొత్త మోడల్స్, కంపెనీ మార్కెట్ షేర్‌ను మరింత బలోపేతం చేస్తాయని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు.
