కాశ్మీర్ లోని పంపూర్ (Pampore) ప్రాంతంలో సాగు అవుతున్న కుంకుమపువ్వుకు సెప్టెంబర్ నెలలో పెరిగిన ఉష్ణోగ్రతలు మరియు నీటి పారుదల సౌకర్యాలు లేకపోవడంతో ముప్పు ఏర్పడింది. సప్లై తగ్గడం వల్ల మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
కాశ్మీర్ వ్యాలీలో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా సెప్టెంబర్ నెలలో ఉండే వాతావరణం, ఇప్పుడు మండుతున్న ఎండలతో పూర్తిగా మారిపోయింది. మన దేశంలో 90% కుంకుమపువ్వు సప్లై కాశ్మీర్ నుంచే వస్తుంది. అక్టోబర్ నెలలో పూత వచ్చే కీలక సమయంలో, సరైన తేమ లేకపోవడం వల్ల దిగుబడిపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.
ఫెయిల్ అయిన 'నేషనల్ సాఫ్రాన్ మిషన్'
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'నేషనల్ సాఫ్రాన్ మిషన్' కింద ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు పంపూర్ ప్రాంతంలో సరిగ్గా పని చేయడం లేదు. ఆధునిక పద్ధతులతో రైతులకు అండగా ఉండాల్సిన ఈ వ్యవస్థలు, అకాల వర్షాలు లేదా ఎండలు వచ్చినప్పుడు రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు.
మార్కెట్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?
గత దశాబ్ద కాలంగా కుంకుమపువ్వు ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. భూమి ఆక్రమణలు, నాణ్యత లేని విత్తనాలు మరియు వాతావరణ మార్పులు ఇప్పటికే పంటను దెబ్బతీశాయి. ఇప్పుడు ఉన్న సప్లై షాక్‌తో దేశీయ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇరాన్ వంటి దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ సవాళ్లు తోడైతే.. సాఫ్రాన్ వాల్యూ చైన్ మొత్తం ప్రభావితం కావచ్చు. కష్టపడి పండించే చిన్న సన్నకారు రైతులు, ఉత్పత్తి తగ్గడం వల్ల పెరిగే మార్కెట్ రేట్ల ప్రయోజనాన్ని అందుకోలేకపోతున్నారు.
