రైతులకు, కంపెనీలకు.. కొత్త నియమాలతో మార్కెట్ ప్రక్షాళన
కేంద్ర ప్రభుత్వం దేశీయ విత్తనాల రంగంలో సంస్కరణలకు సిద్ధమైంది. 1966 నాటి పురాతన సీడ్స్ యాక్ట్ స్థానంలో, నూతన 'సీడ్స్ బిల్ 2025' ను పార్లమెంట్ ముందుంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త చట్టం ప్రకారం, విత్తనాల ఉత్పత్తి, అమ్మకం, పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించారు. విత్తనాల నాణ్యతను మెరుగుపరచడం, రైతులకు సరైన విత్తనాలు అందేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
కఠిన నిబంధనలు.. భారీ శిక్షలు
ప్రతి విత్తన రకాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో పరిశోధన హైబ్రిడ్స్, నోటిఫై కాని రకాలు వంటివి దీని పరిధిలోకి రాలేదు. కానీ, ఈ కొత్త బిల్లు అన్నింటినీ కవర్ చేస్తుంది. కల్తీ, రిజిస్ట్రేషన్ కాని విత్తనాలు అమ్మడం వంటి తీవ్రమైన నేరాలకు ₹30 లక్షల వరకు జరిమానా, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చిన్న చిన్న తప్పులకు కూడా ₹1 లక్ష నుండి జరిమానాలు ఉంటాయని సమాచారం. అంతేకాకుండా, విత్తనాల జాడను (traceability) సులభతరం చేయడానికి ప్రతి ప్యాకెట్ పై QR కోడ్ తప్పనిసరి చేయనున్నారు.
మార్కెట్ లో పోటీ.. ఎవరికి లాభం?
సుమారు ₹40,000 కోట్ల విలువైన భారత విత్తనాల మార్కెట్ ఈ బిల్లుతో గణనీయంగా మారనుంది. కొత్త నిబంధనలు, తప్పనిసరి రిజిస్ట్రేషన్ వల్ల కంపెనీలకు నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇది పెద్ద, ఆర్థికంగా బలమైన కంపెనీలకు అనుకూలంగా మారవచ్చు. గతంలో ప్రభుత్వ రంగం ఆధిపత్యం చెలాయించినా, ప్రస్తుతం ప్రైవేట్ రంగం వాటా 64% కు చేరుకుంది. ఈ కొత్త రెగ్యులేటరీ వాతావరణం ప్రైవేట్ కంపెనీలకు మరింత ఊతమిచ్చేలా కనిపిస్తోంది.
సవాళ్లు.. భవిష్యత్ అంచనాలు
ఈ బిల్లు ఆశించిన మార్పులు తీసుకురావడానికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. చిన్న విత్తన ఉత్పత్తిదారులకు, కొత్తగా మార్కెట్ లోకి వచ్చేవారికి పెరిగిన కంప్లైయెన్స్ ఖర్చులు భారంగా మారవచ్చు. ఫిడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (FSII) అంచనాల ప్రకారం, కేవలం లైసెన్సింగ్, ఇతర రెగ్యులేటరీ సమస్యల వల్లనే ఏటా దాదాపు ₹800 కోట్ల నష్టం వాటిల్లుతోంది. అయితే, ప్రభుత్వం 'ఒకే దేశం-ఒకే లైసెన్స్' వంటి విధానాలు అమలు చేస్తే, కంపెనీలు తమ కొత్త రకాలను వేగంగా మార్కెట్లోకి తీసుకురాగలవు. 2035 నాటికి భారత విత్తనాల మార్కెట్ వాటాను ప్రస్తుత 1% నుండి 10% కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆధునీకరణ, బయోటెక్నాలజీ, ప్రెసిషన్ అగ్రికల్చర్ వంటి టెక్నాలజీల కలయికతో, సుమారు $4.8 బిలియన్ డాలర్ల మార్కెట్ మరింత వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.