భారత వ్యవసాయ రంగం రసాయనిక ఎరువుల నుంచి బయో-ఇన్‌పుట్స్ వైపు మళ్లుతోంది. నేల ఆరోగ్యం, ఎగుమతి నిబంధనలే ప్రధాన కారణం. PM-PRANAM పథకం సహా, ఈ రంగంలోని సవాళ్లు మరియు ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలు ఇక్కడ ఉన్నాయి.
భారతీయ వ్యవసాయ రంగం ఇప్పుడు నిశ్శబ్ద విప్లవానికి సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా రసాయనిక ఎరువులను అతిగా వాడటం వల్ల దేశంలోని దాదాపు 30% భూమి నిస్సారంగా లేదా ఎడారిగా మారుతోంది. ఈ నేపథ్యంలో, కేవలం దిగుబడుల కోసమే కాకుండా, దీర్ఘకాలిక భూసారాన్ని కాపాడుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది.
పాలసీ మరియు ఎగుమతుల ఒత్తిడి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM-PRANAM పథకం ఈ మార్పుకు ప్రధాన చోదక శక్తిగా మారింది. రసాయనిక ఎరువుల సబ్సిడీ ఆదాతో 50% నిధులను రాష్ట్రాలకు కేటాయించడం ద్వారా, బయో-ఎరువుల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు, ఐరోపా సమాఖ్య (EU) మరియు జపాన్ వంటి మార్కెట్లలో ఎగుమతి చేసే ఉత్పత్తులపై కఠినమైన 'రెసిడ్యూ' నిబంధనలు ఉన్నాయి. కెమికల్స్ ఆనవాళ్లు ఉన్న ఉత్పత్తులను రిజెక్ట్ చేయడం వల్ల భారీ ఆర్థిక నష్టాలు వస్తుండటంతో, ఎగుమతిదారులు ఇప్పుడు బయో-ఇన్‌పుట్స్‌ను తప్పనిసరిగా భావిస్తున్నారు.
కార్పొరేట్ వ్యూహాలు - కంపెనీల రీ-ఓరియంటేషన్
UPL, E.I.D. Parry, మరియు Coromandel International వంటి దిగ్గజ అగ్రో-కెమికల్ కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటున్నాయి. కేవలం రసాయనిక ఎరువులకే పరిమితం కాకుండా, మైక్రోబియల్ సైన్స్, జెనోమిక్ సొల్యూషన్స్‌పై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వీటి లక్ష్యం.. కెమికల్స్ ని పూర్తిగా తొలగించడం కాకుండా, బయో-ప్రొడక్ట్స్ ద్వారా వాటి ప్రభావాన్ని మెరుగుపరచడమే (Integrated Model).
ఇన్వెస్టర్లు గమనించాల్సిన సవాళ్లు
అయితే, ఈ మార్పు అంత సులభం కాదు. రసాయనిక ఎరువులు సబ్సిడీల వల్ల రైతులకు చౌకగా లభిస్తాయి, కానీ బయో-ఇన్‌పుట్స్ ధరలు ఎక్కువగా ఉండటం చిన్న రైతులకు భారంగా మారుతోంది. అంతేకాకుండా, బయో-ప్రొడక్ట్స్ వాడకంలో జాగ్రత్తలు (ఉష్ణోగ్రత నియంత్రణ, సరైన అప్లికేషన్) పాటించకపోతే దిగుబడులు తగ్గే రిస్క్ కూడా ఉంది. ఈ టెక్నాలజీని రైతులకు ఎంత వేగంగా అలవాటు చేస్తారనే దానిపైనే సంబంధిత కంపెనీల భవిష్యత్తు లాభాలు ఆధారపడి ఉంటాయి.
