యూఏఈ మార్కెట్: భారతీయ ఫుడ్ కంపెనీలకు బంగారు బాట
భారతదేశ ఆహార, పానీయాల రంగం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు చేసే ఎగుమతులను గణనీయంగా పెంచుకునేందుకు అపార అవకాశాలున్నాయని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (TPCI) అభిప్రాయపడింది. ప్రస్తుతం భారత ఎగుమతులు $3.6 బిలియన్లతో సరిపెట్టుకున్నా, యూఏఈ మొత్తం ఆహార, పానీయాల దిగుమతుల మార్కెట్ సుమారు $22 బిలియన్లుగా ఉంది. ఈ భారీ అంతరం.. భారతీయ ఉత్పత్తులకు అన్వేషించాల్సిన పెద్ద మార్కెట్ ఉందని స్పష్టం చేస్తోంది.
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తో పుంజుకుంటున్న వాణిజ్యం
2021 నుంచి 2025 మధ్యకాలంలో, భారతదేశ ఆహార, పానీయాల ఎగుమతులు యూఏఈకి వార్షికంగా 11.3 శాతం చొప్పున వృద్ధి చెంది, 2025 నాటికి $3.6 బిలియన్లకు చేరుకున్నాయి. యూఏఈలో పెరుగుతున్న డిమాండ్, ముఖ్యంగా ఆహార ధాన్యాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, మాంసం, వ్యవసాయ ఉత్పత్తులకు భారతదేశం నమ్మకమైన సరఫరాదారుగా మారడం ఈ వృద్ధికి దోహదపడుతోంది. TPCI చైర్మన్ మోహిత్ సింగ్లా చెప్పినట్లుగా, యూఏఈ తన ఆహార అవసరాల్లో దాదాపు 85-90% వరకు దిగుమతులపైనే ఆధారపడుతుంది.
వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే చర్యలు
యూఏఈ ఆహార దిగుమతుల మార్కెట్లో భారతదేశ వాటా ప్రస్తుతం సుమారు 10% గా ఉంది. మెరుగైన వాణిజ్య సంబంధాలు, ఆహార ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ లో పెట్టుబడులతో ఈ వాటాను పెంచుకునే అవకాశం ఉంది. గత మే 1, 2022 నుండి అమల్లోకి వచ్చిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA).. ఇండియా-యూఏఈ ఆహార భాగస్వామ్యంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ ఒప్పందానికి మద్దతుగా, అబుదాబి ఫుడ్ హబ్, TPCI లతో కలిసి ముంబైలో మే 19న ఇండో-ఫుడ్ పార్క్ ను ప్రారంభించారు. ఈ పార్క్ భారతీయ ఆహార కంపెనీలను అబుదాబి ఫుడ్ హబ్ తో అనుసంధానం చేసి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) తో పాటు ప్రపంచ మార్కెట్లలోకి వారి ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది.
