వాతావరణం-ఆర్థిక వ్యవస్థ మధ్య సన్నగిల్లుతున్న బంధం
చారిత్రాత్మకంగా చూస్తే, ఎల్ నినో ప్రభావం భారత వ్యవసాయంపై చాలా ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. 2026 జూన్-ఆగస్టు మధ్య కాలంలో ఎల్ నినో ఏర్పడే అవకాశాలు 61-70% వరకు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గతంలో కంటే తక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ వ్యవసాయ జీడీపీ (Agricultural GVA) భారీగా పడిపోయేది. అయితే, 2004 తర్వాత జరిగిన ఏడు ఎల్ నినో సంఘటనలలో, వర్షాలు తగ్గినప్పటికీ కేవలం రెండింటిలో మాత్రమే వ్యవసాయ జీడీపీలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.
వ్యవసాయం దాటి.. విభిన్న ఆదాయ మార్గాలు
NABARD 2022 సర్వే ప్రకారం, గ్రామీణ కుటుంబాల ఆదాయంలో వ్యవసాయం వాటా కేవలం మూడో వంతు మాత్రమే. మిగిలిన రెండు వంతులు వేతనాలు (16%), వివిధ వ్యాపారాలు (15%), ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు (23%), పశుపోషణ (12%) వంటి ఇతర మార్గాల ద్వారా వస్తున్నాయి. ఈ విభిన్న ఆదాయ వనరులు, వ్యవసాయ ఆదాయం తగ్గినా కూడా చాలావరకు గ్రామీణ సంపాదనలను కాపాడతాయి.
ఇది గ్రామీణ డిమాండ్‌కు కూడా బలాన్నిస్తోంది. గ్రామీణ కొనుగోలు శక్తికి సూచికగా ఉండే టూ-వీలర్ల అమ్మకాలు గతంలో ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ స్థిరంగా పెరిగాయి. 2015-16 మధ్య కాలంలో 3% వృద్ధి చెందగా, 2023-24లో ఏకంగా 13.3% దూసుకెళ్లాయి.
గోల్డ్ లోన్స్ ఆదుకుంటున్న గ్రామీణుల ఆదాయం
బంగారం ధరలు పెరగడంతో గ్రామీణ, పాక్షిక-పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. బంగారం ఒక ఆర్థిక భద్రతను, పెరుగుతున్న కొల్లేటరల్ విలువను అందిస్తూ.. ఆదాయం లేదా ధరల షాక్‌లకు వ్యతిరేకంగా ఒక కవచంలా పనిచేస్తోంది.
గత డిసెంబర్ 2025 నాటికి, మొత్తం గోల్డ్ లోన్స్‌లో 68% గ్రామీణ, పాక్షిక-పట్టణ ప్రాంతాల నుండే జరిగాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో గోల్డ్ లోన్ల వార్షిక వృద్ధి గణనీయంగా ఉంది. సగటు లోన్ మొత్తం 2023 చివర, 2025 చివరి నాటికి దాదాపు రెట్టింపు అయ్యింది (1.8 రెట్లు పెరిగింది). ఇది ఈ ఆర్థిక వనరులపై ఆధారపడటం పెరిగిందని సూచిస్తోంది.
బలమైన రబీ పంటతో ఊరట
భారత వ్యవసాయ రంగానికి మరో ఊరట, బలమైన రబీ పంట. గత ఏడాదితో పోలిస్తే ఇది 3.2% అధికంగా ఉంటుందని, ధరలు కూడా మెరుగుపడతాయని అంచనా. రెండేళ్లుగా మంచి వర్షపాతం, ఈ బలమైన రబీ పంట.. ఎల్ నినో వల్ల వేసవి పంటకు కలిగే అంతరాయాలను తట్టుకోవడానికి ఒక దృఢమైన పునాదిని అందిస్తున్నాయి.
2026 చివర్లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నందున, వేసవి పంటపై దాని ప్రభావం భయపడినంత తీవ్రంగా ఉండకపోవచ్చు.
